దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో కరోనావైరస్ చాలా మందికి ప్రబలిన విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక్కడున్న తబ్లీగీ జమాత్‌కు చెందిన మర్కజ్‌లో మార్చి నెలలో ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. దీనికి వేల మంది హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి వచ్చినవారు కూడా అందులో ఉన్నారు.
ఇక్కడ ఇలాంటి కార్యక్రమం జరగడం ఇది కొత్తేమీ కాదు. కానీ, కరోనావైరస్ వ్యాప్తి గురించి తీవ్ర ఆందోళనలు నెలకొన్న సమయంలో దీన్ని నిర్వహించారు.
తబ్లీగీ జమాత్ మాత్రం జనతా కర్ఫ్యూ గురించి ప్రకటించగానే తాము ఈ కార్యక్రమాన్ని ఆపేశామని చెబుతోంది. లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చినవారు వెనక్కి వెళ్లలేకపోయారని అంటోంది.
ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం కూడి ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు. అక్కడున్నవారిని వెళ్లగొట్టారు. అందరినీ కరోనావైరస్ పరీక్షల కోసం పంపించారు. వారిలో తొలుత 24 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది.
దీని తర్వాత భారత్‌లో ఒక్కసారిగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య భారీగా పెరగడం మొదలైంది.
బ్లీగీ జమాత్ నేపథ్యం...
తబ్లీగీ జమాత్ 1926-27లో మొదలైంది. ఇస్లామిక్ స్కాలర్ మౌలానా మహమ్మద్ ఇలియాస్ దీన్ని ప్రారంభించారు. దిల్లీ నుంచి మేవాత్ వరకు ఉన్న వారికి మతపరమైన విద్య అందించేందుకు దీన్ని ఆయన మొదలు పెట్టారని చెబుతారు. ఆ తర్వాత ఇది కొనసాగుతూ వచ్చింది.
తబ్లీగీ జమాత్ మొదటి సమావేశం 1941లో జరిగింది. ఇందులో 25 వేల మంది పాల్గొన్నారు. 1940లలో అవిభాజ్య భారత్ వరకే జమాత్ కార్యకలాపాలు పరిమితమయ్యాయి. అనంతరం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో దీని శాఖలు ఏర్పాటయ్యాయి. జమాత్ కార్యకలాపాల్లో వేగం పెరిగింది. ప్రపంచమంతా వ్యాపించింది. అమెరికా, బ్రిటన్, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్‌ల్లో కూడా ఇప్పుడు దీని కేంద్రాలున్నాయి.
తబ్లీగీ జమాత్ అతిపెద్ద సమావేశం ఏటా బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. పాకిస్తాన్‌లోని రాయ్‌విండ్‌లోనూ ఏటా ఓ కార్యక్రమం జరుగుతుంది. వీటిలో పాల్గొనేందుకు వివిధ దేశాల ముస్లింలు వస్తుంటారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ఉన్న జఫర్ సరేశ్వాలాకు తబ్లీగీ జమాత్‌తో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం తబ్లీగీ జమాత్ ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం సంస్థ. 140 దేశాల్లో దీని కేంద్రాలు ఉన్నాయ`