కోవిడ్-19కి వ్యాక్సిన్ రాదేమో.. WHO నిపుణుడి షాకింగ్ స్టేట్‌మెంట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఇక వ్యాక్సిన్‌ను ఎప్పటికీ చూడలేమా? ఈ ప్రశ్నకు లేకపోవచ్చనే సమాధానం చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికీ అనేక దేశాల్లో 100కు పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నా, వాటిలో రెండు మనుషులపై ప్రయోగాల దశకు చేరుకున్నా.. ఆశాజనక ఫలితాలైతే కనిపించడంలేదని చెబుతున్నారు. ఈ మాటలెవరో అల్లాటప్పా వ్యక్తులు చెప్పారనుకుంటే పొరపాటే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్-19 నిపుణులు డాక్టర్ డేవిడ్ నబారో చెప్పారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.


భయంకరమైన వ్యాధులు హెచ్‌ఐవీ, డెంగ్యూకు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నా వీటికి ఔషధాన్ని కనుక్కోలేకపోయారు. ఈ జాబితాలో కోవిడ్-19 కూడా చేరుతుందేమోనని చాలా మంది కలవరానికి గురవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు కూడా ఇవే సంకేతాలను ఇస్తున్నాయి.

అదే జరిగితే మరి కొంత కాలం కరోనా వైరస్‌తో కలిసి జీవించడం తప్పదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు ఈ మహమ్మారితో కలిసి జీవించమెలాగో నేర్చుకోవాలి. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి.