కరోనా వైరస్ రోగులను కాపాడేందుకు వైద్యులు రేయింబవళ్లు శ్రమిస్తున్నందుకు ఇటీవల ప్రభుత్వం పూల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మరి మందుబాబులపై పూల వర్షం ఎందుకనేగా మీ సందేహం? అయితే, ఈ పూల వర్షం కురిపించింది ప్రభుత్వం కాదు. ఓ సామాన్యుడు. ఈ అరుదైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
లాక్‌డౌన్ కాలంలోనూ మద్యం కరువుతో కటకటలాడుతున్న మందుబాబుల బాధ తెలుసుకుని ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరిచిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం దుకాణాల కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఇన్ని రోజులు డబ్బులు లేవని చెప్పిన వ్యక్తులు సైతం నోట్ల కట్టలతో దుకాణాలు ముందు బారులు తీరుతున్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. మందు బాటిళ్లను సాధించిన తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వీరి సహనానికి ఫిదా అయిన ఓ వ్యక్తి చందనగర్‌లో మద్యం దుకాణం వద్ద నిలుచున్న జనంపై పూల వర్షం కురిపించాడు.